రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి దాదాపు ప్రపంచంలోని పలు దేశాలపై తనకిష్టమొచ్చిన రీతిలో టారిఫ్ లతో విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్ నకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా చట్టసభల (కాంగ్రెస్) అనుమతిలేకుండా విధించిన ఆ టారిఫ్ లను రద్దుచేస్తూ 9 మంది జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 6:3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ప్రెసిడెంట్ అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార టారిఫ్ లు విధించడాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది.రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు, టారిఫ్ ల విధింపు అధికారం ఉంటుందని స్పష్టంచేసింది. ‘పన్నులు, సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతలు కార్యనిర్వాహక శాఖకు ఇవ్వలేదు. ట్రంప్ ఆదేశాలతో దిగుమతిదారుల నుంచి ఇప్పటి వరకు అదనంగా వసూలు చేసిన టారీఫ్ లను ఆయా కంపెనీలకు తిరిగి చెల్లించాలా వద్దా అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పలేదు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో… బ్రిటన్, జపాన్, ఐరోపా సమాఖ్య, మలేసియా, ఇండొనేసియా, వియత్నాం, భారత్ తదితర దేశాలతో అగ్రరాజ్యం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలన్నీ నిరర్థకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
ప్రతీకార టారిఫ్ లు రద్దు కావడం వల్ల సగానికిపైగా భారత ఎగుమతులపై 18 శాతం అదనపు సుంకాల భారం తగ్గనుంది. దీంతో అత్యధిక ప్రాధాన్య దేశాలపై విధించే టారిఫ్ లు మాత్రమే భారత్ కు వర్తించే అవకాశం ఉంది. మిగిలిన ఎగుమతులపై ఐఈఈపీఏ సెక్షన్ 232 కింద సుంకాలు కొనసాగుతాయి. స్టీల్, అల్యూమినియంలపై 50 శాతం, కొన్ని ఆటోమొబైల్ పరికరాలపై 25 శాతం టారిఫ్ వర్తిస్తుంది. ఎగుమతి విలువలో దాదాపు 40 శాతం ఉండే స్మార్ట్ ఫోన్లు, పెట్రోలియం ప్రొడక్ట్స్, మెడిసిన్స్ వంటివి టారిఫ్ ల నుండి మినహాయింపు పొందుతాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత్ అమెరికాతో తన ట్రేడ్ డీల్ సమీక్షించుకునేందుకు వీలు కలిగింది.
సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి అవమానకరమని ఆ జడ్జీలను చూసి సిగ్గుపడుతున్నట్లు ట్రంప్ స్పందించారు. వారి తీర్పు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైనట్లుందని ఆరోపించారు. ఈ కోర్టులను ఏదో ఒకటి చేయాలి. వివిధ దేశాలపై టారిఫ్ లపై విధింపులో వెనక్కి తగ్గేదే లేదు. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) లోని సెక్షన్ 122ని ఉపయోగిస్తూ ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తా. భారత్తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదని పేర్కొన్నారు.