అండర్-19 వరల్డ్ కప్ ను మరోసారి కైవసం చేసుకుని భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి సత్తాచాటింది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్ లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవన్షీ 150 (80; 15×4, 15×6) విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ఆయుష్ మాత్రే 53 (51; 7×4, 2×6), అభిగ్యాన్ కుందు 40 (31; 6×4, 1×6), కనిష్క్ చౌహన్ 37 నాటౌట్, వేదాంత్ త్రివేది 32, విహాన్ మల్హోత్రా 30 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు, సెబాస్టియన్ మోర్గాన్ 2వికెట్లు, అలెక్స్ గ్రీన్ 2 వికెట్లు, మన్నీ లుమ్స్డమ్ 1 వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైంది. కాలేబ్ ఫాల్కనర్ 115 (67; 9×4, 7×6) సెంచరీతో రాణించాడు. బెన్ డాకిన్స్ 66 (56; 7×4, 2×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బెన్ మయెస్ (45), థామస్ ర్యూ (31), జేమ్స్ మింటో (28) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. భారత బౌలర్ల ధాటికి భారీ రన్స్ తేడాతో ఓడిపోయింది. అంబరీష్ 3 వికెట్లు, కనిష్క్ చౌహన్ 2 వికెట్లు, దీపేష్ దేవేంద్రన్ 2 వికెట్లు, ఖిలాన్ పటేల్ 1 వికెట్, ఆయుష్ మాత్రే 1 వికెట్ పడగొట్టారు. టోర్నీలో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవన్షీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.