టీ 20 సిరీస్ లలో భారత క్రికెట్ జట్టు హవా కొనసాగుతోంది. టీ 20 వరల్డ్ కప్ కు ముందు తనదైన ఆటతీరుతో భారత్ మరోసారి సత్తా చాటింది. భారత న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ 20లో భారత్ న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 48 (40; 6×4, 1×6) టాప్ స్కోరర్. మార్క్ చాప్ మాన్ 32 (23; 2×4, 2×6) పర్వాలేదనిపించాడు. సాంట్నర్ 27(17; 3×4, 1×6) భారత బౌలర్లలో బుమ్రా 3వికెట్లతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్య 2వికెట్లు, రవి బిష్ణోయ్ 2వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా 1 వికెట్ తీశాడు. అనంతరం భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సంజు శాంసన్ (0) మొదటి బంతికే వెనుదిరిగిన ఇషాన్ కిషన్ 28 (13; 3×4, 2×6) ధాటిగా ఆడాడు. ఇక ఈ ఫార్మాట్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ 68 నాటౌట్ (20; 7×4, 5×6) మరోసారి విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగాడు. ఈ క్రమంలో భారత్ తరపున రెండో ఫాస్టెస్ట్ టీ 20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 57 నాటౌట్ (26; 6×4, 3×6) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించి మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.