భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యయం మరింత పటిష్టం కానుంది. ఈక్రమంలో భారత 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు యూరోపియన్ కమీషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ నేడు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన ఉభయ పక్షాల సంబంధాలలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉర్సులా వాన్ డెర్ లేయెన్కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద స్వాగతం పలికారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాలైన భారత్, ఈయూల మధ్య పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలతో బంధం బలపడుతోందని భారత విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ‘ఎక్స్’ లో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కజా కల్లాస్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఈయూ నేతల పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈయూ దేశాల అంబాసిడర్ లతో సమావేశమయ్యారు. బలమైన భారత్-ఈయూ భాగస్వామ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించగలదని, సప్లై చైన్ ను మరింత పటిష్టం చేయగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు భారత్ చేరుకున్న ఈయూ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు. జనవరి 27న జరగనున్న 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీతో కలిసి పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు పక్షాల మధ్య ట్రేడ్, సెక్యూరిటీ, టెక్నాలజీ వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. దీంతో పాటు భారత్-ఈయూ బిజినెస్ ఫోరమ్ ను కూడా నిర్వహించనున్నారు.