ఐపీఎల్ సీజన్ 19లో మొదటి మ్యాచ్ లో విజయం సాధించి ఆ తరువాత వరుసగా 4 పరాజయాలతో డీలా పడిన ముంబై ఇండియన్స్ తాజాగా విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ 101 నాటౌట్ (45; 8×4, 7×6) సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. నమన్ ధీర్ 45 (32; 6×4, 1×6) పరుగులు చేశాడు. ఇక గుజరాత్ బౌలర్లలో రబడా 3 వికెట్లు, ప్రసీద్ కృష్ణ, సిరాజ్ లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. కీలక బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (26) టాప్ స్కోరర్. షారుక్ ఖాన్ (17), శుభ్ మన్ గిల్ (14), రబడా (12) పరుగులు చేశారు. స్టార్ హిట్టర్లు బట్లర్ (5), గ్లెన్ ఫిలిప్స్ (6), రాహుల్ తేవాటియా (8) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లు, ఏఎం గజన్ ఫర్ 2 వికెట్లు, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్య 1 వికెట్, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ పడగొట్టారు.