ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా సొంత గడ్డపై ఆడిన మ్యాచ్ లో సన్ రైజర్స్ పరాజయం చెందింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7), కెప్టెన్ ఇషాన్ కిషన్ (1), లివింగ్ స్టన్ (14) నిరాశపరిచారు. హైదరాబాద్ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో హెన్రిచ్ క్లాసీన్ 62 (41; 5×4, 2×6), నితీష్ కుమార్ రెడ్డి 56 (33; 3×4, 5×6) హాఫ్ సెంచరీలతో కీలకపాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ మంచి స్పెల్ తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ కూడా 2 వికెట్ల చొప్పున తీశారు. దిగ్వేశ్ సింగ్ రాఠీ, మనిమారన్ సిద్దార్థ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్ ను రిషబ్ పంత్ 68 నాటౌట్ (50; 9×4) ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చాడు. ఐడెన్ మార్కరమ్ 45 (27; 6×4, 2×6) ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచారు. దీంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు రాగలిగింది. హార్ష్ దూబే 2 వికెట్లు, ఇషాన్ మలింగ, శివాంగ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు.