మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీ.ఆర్.ఎస్ కైవసం చేసుకోవడం పట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన కీలక నేతలు, పార్టీ నాయకులు, శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చిచెప్పిందని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయన్నారు. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దామని పేర్కొన్నారు.