టీ 20 వరల్డ్ కప్ సెమీస్ కు రిఫరీలుగా ఎవరు ఉండనున్నారో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. భారత మాజీ క్రికెటర్, బౌలింగ్ దిగ్గజం జవగళ్ శ్రీనాథ్, ఆండీ పైక్రాఫ్ట్ లను రిఫరీలుగా నియమించింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ టీమ్ లు ఈనెల 4న సెమీ ఫైనల్ వన్ లో తలపడనున్నాయి. ఇక మార్చి 5న ముంబై లోని వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ లు సెమీస్ లో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ కు శ్రీనాథ్ రిఫరీగా ఉండనున్నారు. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా
రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, అలెక్స్ వార్ఫ్ ఉండనున్నారు. థర్డ్ అంపైర్ గా నితిన్ మేనన్, ఫోర్త్ అంపైర్ గా రాడ్ టక్కర్ ఉంటారు. ముంబైలో జరిగే భారత్-ఇంగ్లాండ్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కు ఆండీ పైక్రాఫ్ట్ రెఫరీగా వ్యవహరించనున్నారు. క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్ ఫీల్డ్ అంపైర్లుగా, థర్డ్ అంపైర్ గా ఆడ్రియాన్ హోల్డ్ స్టాక్, ఫోర్త్ అంపైర్ గా పాల్ రీఫెల్ వ్యవహరించనున్నారు. ఈ రెండు మ్యాచ్ లలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొని ఉంది గెలిచిన జట్లు ఈనెల 8న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ లో తలపడతాయి.