సర్ఫరాజ్ కు అవకాశం ఇవ్వకపోవడంపై వెంగ్ సర్కార్ అసహనం

Spread the love

భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబరుస్తూ రాణిస్తున్నాడు. అయితే అతనిని సెలక్టర్లు విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ విషయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు చేస్తున్న  సర్ఫరాజ్‌ కు మూడు ఫార్మాట్లలోనూ ఆడే సత్తా ఉందని, అలాంటి ప్రతిభావంతుడిని పక్కన పెట్టడం బాధాకరమని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, గోవాపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 157 పరుగుల విధ్వంసకర సెంచరీ సాధించాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలోనే వెంగ్ సర్కార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం వచ్చినప్పుడు సర్ఫరాజ్ అద్భుతంగా ఆడాడని, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వలేదని అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు. అన్ని ఫార్మాట్లకు సరిపోయే  తన ఆటను మార్చుకోగల సత్తా ఉన్న ఆటగాడిని ఇలా విస్మరించడం నిజంగా సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించాడు.

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు చేస్తున్నప్పటికీ, భారత జట్టులో అరంగేట్రం చేసిన సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసినా సర్ఫరాజ్‌ కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంపై క్రీడాభిమానులలో చర్చ జరుగుతోంది. మాజీ దిగ్గజం వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.