విద్యార్థుల సమస్యపై మొదలైన పోరాటం.. ఇప్పుడు హరీశ్‌రావు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా మారింది. జీవో 97ను రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కితే.. వారి తరఫున గళమెత్తేందుకు మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ కీలక నేత హరీశ్‌రావు రంగంలోకి దిగారు. విద్యార్థులకు అండగా నిలవాలని వరంగల్ బయల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గలేదు.. చివరకు వరంగల్ చేరుకుని విద్యార్థులను కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో అరెస్ట్ అయ్యారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా డిప్లొమా తర్వాత ఈసీఈటీ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా చేరే లేటరల్ ఎంట్రీ అవకాశాన్ని కోల్పోతామనే భయం వారిలో ఉంది. ఉన్నత విద్యా అవకాశాలు, విద్యా స్వయంప్రతిపత్తి, ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలపైనా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే జీవో 97ను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్‌తో తరగతులను బహిష్కరించి నిరసనలకు దిగారు. ఈ ఆందోళనకు రాజకీయ మద్దతు ఇవ్వడంలో హరీశ్‌రావు ముందుండటంతో.. వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. విద్యార్థులను కలిసేందుకు వరంగల్ వెళ్లాలని భావించిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావును పోలీసులు హైదరాబాద్‌లోని కోకాపేట నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం 9 గంటల 43 నిమిషాలకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హరీశ్ రావు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లనివ్వాలని ఆయన కోరినా.. శాంతిభద్రతల కారణంగా అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. అయితే హౌస్ అరెస్ట్ తో హరీశ్ రావు వెనక్కి తగ్గలేదు. మరోవైపు వరంగల్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా.. హరీశ్‌రావు రాక నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాలేజీకి వచ్చే విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపించారు. నలుగురు, ఐదుగురికి మించి విద్యార్థులు గుంపుగా రావడాన్ని అడ్డుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.ఎట్టకేలకు హరీశ్‌రావు వరంగల్ చేరుకున్నారు. ముందుగా హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు హరీశ్ రావును అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హరీశ్‌రావు అరెస్ట్ విషయం తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగాయి. దీంతో జీవో 97 వ్యవహారంలో హరీశ్ రావు పోరాటం కీలకంగా మారింది. సెప్టెంబర్ 7లోగా జీవో 97ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు. లేకపోతే విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.