12 రోజులుగా జైలులో పెట్టి ‘హ్యాబిచ్యువల్ అఫెండర్’గా చూపించడం దుర్మార్గం

Spread the love

సంగారెడ్డి జైలులో ఉన్న మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ క్రిషాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తోందని అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. మన్నె క్రిషాంక్ ఒక చదువుకున్న యువకుడు, న్యాయవాది, పీహెచ్‌డీ పట్టా పొందిన వ్యక్తి అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో ముందుండి పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. గత రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూ, ప్రజల ముందుకు తీసుకువస్తున్నందుకు క్రిషాంక్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నాలుగేళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితిలో, 12 రోజులుగా జైలులో పెట్టి ‘హ్యాబిచ్యువల్ అఫెండర్’గా చూపించడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టకుండా, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలోనే ప్రభుత్వం బిజీగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా క్రిషాంక్‌ ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, ఈ విషయంపై కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేస్తామని తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్, కేపి వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *