రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యం

Spread the love

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ చేశారు. రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా అమలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో నిర్వహించిన సంప్రదింపులు విజయవంతమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను మా కుటుంబ సభ్యులుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంలో ఏర్పడిన బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తూ వస్తున్నట్లు తెలిపారు.