
ఆ పార్టీలో ఆ పదవి అంటే స్పెషల్ క్రేజ్ …ఇక ఆ పదవి అంటే ఆ పార్టీలోనే కాదు ఏ పార్టీలోనైనా కూడా అంటే క్రేజ్ ఉంటుంది…నిజానికి అదేమీ పార్టీ చీఫ్ పదవి కాదు…అయినా ఆ పదవి కోసం అందరూ ఆసక్తి చూపిస్తారు …అంతే కాదు ఆ పదవి కోసం ఎంతో పోటీ పడతారు …ఆ పదవి తర్వాత సీఎం కావడానికి కేవలం ఇంకొక పదవి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ పదవి కోసం ఇప్పుడు పోటీ పడుతున్న వారి లిస్ట్ చాంతాడంత ఉండడంతో అధిష్ఠానం కూడా అవాక్కవుతోందట . ఇంతకీ ఏమా పదవి? ఆ పదవి కోసం అంత పోటీ ఏంటి? పోటీలో ఉన్నది ఎవరు ..? గెలిచేదెవరు? లెట్స్ వాద్ దిస్ ఇన్ ఆఫ్ ది రికార్డ్
రేపో మాపో తెలంగాణ కాంగ్రెస్ కమిటీల నియామకం పూర్తి చేసే దిశగా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పైనే సీనియర్లంతా దృష్టి సారించినట్లు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద వివిధ మార్గాల ద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట . తమకు తెలిసిన కాంగ్రెస్ పెద్దల ద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు తాము కోరుకున్నట్లు వర్కింగ్ ప్రసిడెంట్ పదవి ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామన్న సంకేతాలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు పంపుతున్నట్లు సమాచారం .
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి బాగా డిమాండ్ ఏర్పడిందని చెప్పాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియమితులయ్యారు. ఆయన హయాంలోనే పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ నియమించింది. ఆ తర్వాత 2015 మార్చి లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పదోన్నతి పొంది టీపీసీసీకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్లు భట్టి విక్రమార్కను హై కమాండ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ ముగ్గురిలో ఒకరైన రేవంత్ రెడ్డి 2021, జూన్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అందులో ప్రస్తుతం పార్టీ పగ్గాలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్, గీతా రెడ్డి, అజారుద్ధీన్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డిని పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరిలో మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసే ఆర్గనైజింగ్ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి వైదొలగి, మహేశ్ కుమార్ గౌడ్ కు అప్పగించారు.
ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై హస్తినలో హస్తం నేతలు కుస్తీ పడుతున్నారట . ఇదంతా చూస్తుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ పదవిలో ఉన్న వారు తరువాత ప్రమోషన్ టీపీసీసీ పదవికి ఎన్నికవడం సంప్రదాయం నడుస్తోంది . టీపీసీసీ చీఫ్ పదవిలో ఉండే అధ్యక్షుల వారికి ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ టీపీసీసీలో నంబర్ టూ స్థానంగా పరిగణిస్తారు . వ్యక్తిగత పలుకుబడి తో పాటు వ్యవస్థలో కూడా పరపతి పెరుగుతుంది. పార్టీ నిర్ణయాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. పార్టీలో కీలకమైన పదవి కావడం వలన క్రియాశీలక నేతగా ఉంటారు. మీడియా ద్వారా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా పార్టీ హైకమాండ్ నేతలతో నిరంతరం టచ్ లో ఉండే కనెక్టివిటీ కూడా ఉంటుంది . వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లో పని చేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మంత్రి పదవులు దక్కించుకున్నారు. బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్గ్ గా పదోన్నతి పొందారు. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షులు లేదా మంత్రులు అయ్యేందుకు ఇదే ప్రధాన మార్గం కనుక కాబట్టి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వర్కింగ్ ప్రసిడెంట్ పదవి కోసం పట్టుబడుతున్నారు.
పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే చాలా కీలక బాధ్యతలను పార్టీ హైకమాండ్ అప్పజెప్పుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నేతలు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారం కలుగుతుంది. వీరికి కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల అమలు, పాార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల బాధ్యతలను అప్పగిస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను గతంలో పార్టీ అప్పగించింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వారికి పార్టీ అనుబంధ సంఘాలు అంటే ఎన్ ఎస్ యూఐ, ఐ. ఎన్. టీ. యూసీ, లేబర్ సెల్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, పార్టీలో అంతర్గత విబేధాలను పరిష్కరించడం వంటి బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్లు నిర్వర్తించాల్సి ఉంటుంది.
తెలంగాణ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం సీనియర్ నేతల మధ్య గట్టి పోటీ ఉంది. ఈ పోస్టు దక్కితే చాలు ఇక తమ పంట పండినట్లేనన్న భావనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రేసులో ఉన్నారు.అయితే కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలో ఉంది కనుక ఈసారి ఆరు వర్కింగ్ ప్రసిడెంట్ పోస్టులు ఉంటాయని సమాచారం జరుగుతోంది .రెడ్డి, మాల, మాదిగ, లంబాడా, ముస్లిం బీసీ సామాజిక వర్గాల వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో నియమించడం ద్వారా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది .కనుక అన్ని సామాజిక వర్గాల నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా చేయాలన్న భావనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మల్లు రవి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, గద్వాల జడ్పీ మాజీ ఛైర్మన్ సరితా యాదవ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మైనార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, ఫహీమ్ ఖురేషి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, ఎస్సీ వర్గం నుంచి ఎన్. ప్రీతమ్, ఎస్టీల నుంచి బెల్లయ్య నాయక్, ఎమ్మెల్యేలు నైని రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి లతో పాటు మరికొందరు బీసీ నేతలు ఇటు ఎమ్మెల్యే టికెట్ ఆశించి అది దక్కకపోవడం…ఆ తర్వాత ఎమ్మెల్సీ టికెట్ అయినా వస్తుంది కూడా ఆశించి ఆ రెండు కూడా దక్కని వారు …పార్టీకోసం కష్టపడుతున్న వారు …పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న యువ నేతలు కూడా తీవ్రంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.
గతంలో వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నప్పుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ ఆర్గనైజింగ్ బాధ్యతలను నిర్వర్తించి పార్టీలో కీలక భూమిక పోషించారు. కొన్ని సమయాల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక బాధ్యతలు కూడా అప్పగిస్తారు. గతంలో వర్కింగ్ ప్రసిడెంట్లుగా పని చేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి పార్టీ స్వరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం తో పాటు పార్టీ టికెట్లు కేటాయించే విషయంలో కూడా వీరి అభిప్రాయాలూ తీసుకుంటారు…టికెట్ రేసులో కూడా అందరి కన్నా ముందుంటారు ….కీలక బాధ్యతలతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు నేరుగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది …దాంతో పార్టీలో కూడా కొంత సొంత క్యాడర్ కూడా ఏర్పడుతుంది …సో ప్రసిడెంట్ పోస్ట్ కు అర్హత వర్కింగ్ ప్రెసిడెంట్ …అందుకే ఈ పోస్ట్ కు ఇంత డిమాండ్ …మరి కాంగ్రెస్ హై కమాండ్ ఈసారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఎవరిని నియమిస్తుందో …చూడాలి.