కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసిఆర్ కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని పేర్కొన్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా? అని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు? అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ… మరోవైపు దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన?సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ… పాలనను గాలికి వదిలేసారా? ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే… ఇక్కడ పాలనను ఎవరు చూస్తారు? అని ప్రశ్నలు గుప్పించారు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని మండిపడ్డారు. అణచివేతలకు, నిర్బంధాలకు, దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులు జరిపిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేశారు.