ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నాం:బీ.ఆర్.ఎస్. నేత హరీష్ రావు

Spread the love

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీ.ఆర్.ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మూసీ నదిలో ఉన్న కాలుష్యం కంటే ప్రతిపక్ష నేతల కడుపుల్లోనే ఎక్కువ విషం నిండి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా.. దీనిపై బి.ఆర్.ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధీటుగా బదులిచ్చారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా..ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు రేవంత్ రెడ్డి నోటిని ప్రక్షాళన చేయాలన్నారు.  అవినీతికి అఫిషియల్ గా రేట్లు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్న  రేవంత్ రెడ్డికి తమ  గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఘాటుగా బదులిచ్చారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలుస్తామంటే.. బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు, అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని పేర్కొన్నారు.  అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి గన్​పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని స్పీకర్ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణి, అహంకారపూరిత వైఖరికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.