కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేయడం లేదని స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజేషన్ చేయాలంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచనలు చేస్తామని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని అపోహలు సృష్టించినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం, కుట్రలు కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉంది. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. “ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయి. కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తుందని, వారసత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోతాయని కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వం చేయడం లేదని ఈ సందర్భంగా వివరించారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తుంది తప్ప, కార్మికులకు నష్టం కలిగే ఏ నిర్ణయం తీసుకోదన్నారు. 2027లో నిర్వహించబోయే పుష్కరాల గురించి సీఎం మాట్లాడారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతాం. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 6,116 కోట్లను కేటాయించామని వాటి వివరాలను తెలిపారు.