స్పెల్లింగ్ మిస్టేక్.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కు SIR నోటీసులు

Spread the love

దేశవ్యాప్తంగా  ఓటర్ జాబితాలో అవకతవకలు సరిచేసేందుకు తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజెన్’ (SIR)  పట్ల వెస్ట్  బెంగాల్ లోని టీఎంసీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సర్వేలో భాగంగా విచారణకు రావాలంటూ ఎన్నికల సంఘం పలువురు ఓటర్లకు నోటీసులు పంపింది. అందులో ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కు కూడా ఉండడంతో ఇది కొంత వివాదాస్పదంగా మారింది. నోబెల్ గ్రహీతకు నోటీసులు పంపడంపై అధికార టీఎంసీ ఎంపీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ మేరకు అమర్త్యసేన్ సొంత జిల్లా బీర్భూమ్ లో నిర్వహించిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీ ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు దీనిపై వెంటనే స్పందించారు. అమర్త్యసేన్ కు నోటీసులపై మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అమర్త్యసేన్ పేరు విషయంలో చోటుచేసుకున్న స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా సిస్టం నోటీసులు పంపిందని, స్పెల్లింగ్ మిస్టేక్ సరిచేయాలని బూత్ లెవెల్ అధికారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అమర్త్యసేన్ విచారణకు రావాల్సిన అవసరం లేదని వివరించారు.