తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ పాలనపై, రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించి ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు. ఈ రెండున్నరేళ్లలో ఏ ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా ఆయన బుద్ధి మారలేదు, భాష మారలేదని విమర్శించారు. ఈరోజు మెదక్ జిల్లాకు రావడానికి ముఖం చాటేశాడు. కరీంనగర్, వరంగల్ పోయిండు కానీ మెదక్ రాలేకపోయాడన్నారు. అవ్వతాతలకు రూ. 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా?ఆడబిడ్డలకు రూ. 2500, తులం బంగారం ఇస్తామన్నారు.. ఇచ్చారా? రైతుబంధుకు ఎసరు పెట్టారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, కేసీఆర్ కిట్.. అన్నీ బంద్ పెట్టారన్నారు. రామాయంపేట అభివృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలోనేనని స్పష్టం చేశారు.రామాయంపేటకు డిగ్రీ కాలేజీ ఇచ్చింది కేసీఆర్ కాదా?ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రోడ్లు బాగు చేసి, ఇక్కడి భూముల విలువ పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. కాంగ్రెస్ వచ్చి రెండున్నరేళ్లయింది.. రామాయంపేటలో ఒక్క రూపాయి పని చేశారా.కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ కు చెప్పినా యూరియా బస్తాలు ఇంటికి వచ్చేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక యూరియా దొరకడమే గగనమైంది. అప్పుడు 24 గంటల కరెంట్ ఉంటే.. ఇప్పుడు 12 గంటలు కూడా సక్కగా ఇస్తలేరని ఆక్షేపించారు. రామాయంపేటకు గుండాగిరి చేసే వాళ్లు కావాలా..ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలా? ఆలోచించుకోండి.మా కార్యకర్తలకు నేను అండగా ఉంటా. వాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు. మర్యాదకు మర్యాద.. దేనికైనా సిద్ధం. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో.. నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. గుర్తుపెట్టుకో అని హరీష్ రావు కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. రామాయంపేటలో కారు గుర్తుకి ఓటేయాలని పిలుపునిచ్చారు.