వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుండి అందించడమే టార్గెట్ గా రాష్ట్రంలోని హాస్పిటల్స్ అభివృద్ధి చెందాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు తగిన  విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని భరోసానిచ్చారు. వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో  హాస్పిటల్ ను మంత్రి దామోదర్ తో కలిసి సీఎం  ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తో పాటు యాజమాన్యాన్ని సీఎం అభినందించారు. మెడికల్ టూరిజం కోసం మొన్నటివరకు ఒక పాలసీ లేదని  తమ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చిందన్నారు.  వైద్య రంగం అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ టూరిజం మరింతగా వృద్ధి చెందాలని పశ్చిమాసియా దేశాలతో నేరుగా ఫ్లైట్  సర్వీసుల కోసం ప్రధానమంత్రిని, పౌర విమానయాన శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. 1967 లో ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఐడీపీఎల్‌ను ఏర్పాటు చేయడంతో ఆ తర్వాత క్రమంలో హైదరాబాద్ ఫార్మా హబ్‌గా అవతరించిందన్నారు.  ఆరోజు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల ఫార్మా హబ్‌గా మారిందని  ఇప్పుడు దేశం నుంచి ఎగుమతి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచి అవుతున్నాయన్నారు.  46 ఏళ్ల కిందట చెన్నైలో 150 పడకలతో ప్రారంభమైన అపోలో హాస్పిటల్స్ తన ప్రయాణంలో 76 వ బ్రాంచ్‌ ను ప్రారంభిస్తున్నారు. 2028 డిసెంబర్ లోపు 100వ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగీతా రెడ్డి, శోభనా కామినేని, ఉపాసన కొణిదెలతో పాటు ఇతర యాజమాన్య ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *