తెలంగాణ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం , మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టని ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. దాదాపు 700 పైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించింది. ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయని విమర్శించారు. అందువల్లనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే అని మొన్న పంచాయితీ ఫలితాలు, నేడు మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగురేసేందుకు నిర్విరామ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.