తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజా పాలనపై ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయన్నారు. ఈ విజయాన్ని మేము ప్రజల ఆశీర్వాదంగా, బాధ్యతగా స్వీకరిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత రెండేళ్లుగా విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా మా ప్రభుత్వం కట్టుబాటుతో పనిచేస్తోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ధృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయాలకు ఈ ఫలితాలు మద్దతుగా నిలిచాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గా నా బాధ్యతలతో పాటు మంత్రివర్గం మొత్తం కలిసికట్టుగా అభివృద్ధి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు. కార్యకర్తల శ్రమకు, ప్రజల అపారమైన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, మరింత పారదర్శకతతో, మరింత బాధ్యతతో ప్రజా పాలనను బలోపేతం చేయడం మా సంకల్పమని భట్టి పేర్కొన్నారు.