మంచిగా సదువుకోండి బిడ్డ..  పేద విద్యార్థుల చదువులకు కె.సి.ఆర్ ఆర్థిక సాయం

Spread the love

ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగు బిడ్డలకు మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి పేద రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న నవీన్, అదే గ్రామానికి చెందిన, ప్రమాదవశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు కొడుకు, బీటెక్ చదువుతున్న అజయ్‌ లను చేరదీసి వారి ఇంజనీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెల్లించారు. వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు వారికి విడివిడిగా చెక్కులు అందించారు. కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డా.. మీరు కష్టపడి గొప్ప స్థాయిని చేరుకోవాలి. ఫీజుల కోసం భయపడొద్దు. ఏ సమస్య వచ్చినా నేనున్నా..”అంటూ భరోసా నిస్తూ కేసీఆర్ వారిని  ఆశీర్వదించారు. కాగా.. విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, ఆర్థికంగా ఆదుకుని, తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన కేసీఆర్ కు పిల్లల తల్లులు తమ కృతజ్ఞతను తెలియజేశారు. తమ చదువుకోసం భరోసాగా నిలిచిన కేసీఆర్ గారికి ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.