విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Spread the love

విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఒకటవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులపై సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్ర‌స్తుతం బాలిక‌ల‌కు కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో విడ‌తలో బాలుర‌కు కేటాయించాలన్నారు. ఈ స్కూళ్లలో సోలార్ కిచెన్ల నిర్మాణాలను పీఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాలను పరిశీలించాలి. వీటి నిర్మాణాల‌కు సంబంధించి బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయాలని స్పష్టం చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాల నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి అందుబాటులోకి రావాలని ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఒక‌టి నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ మార్పుపై క‌స‌ర‌త్తును వెంట‌నే ప్రారంభించాలన్నారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ప‌నులు వేగ‌వంతం చేయాలని సూచించారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో నూత‌న కోర్సులు, మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాల‌జీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వ‌ర‌గా అమ‌ల‌య్యేలా చూడాలన్నారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి విద్యార్థికి క‌చ్చితంగా ఉద్యోగం ల‌భించేలా సిల‌బ‌స్, బోధ‌న అందించాలని స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాలలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా అమ‌లు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తెలంగాణ‌ వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాలని సీఎం రేవంత్  ఆదేశించారు.