బీ.ఆర్.ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ తీవ్రంగా ఖండించారు. BRS స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ సీఎం రేవంత్, మంత్రి వివేక్ కలిసి ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కె.టి.ఆర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ క్యాతన్‌పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్దిరాలేదని మండిపడ్డారు.అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులు కూడా తమ వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అరెస్టు చేసిన బాల్క సుమన్ ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని BRS పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
మరొక కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు కూడా బాల్క సుమన్ అరెస్టు ఖండించారు. క్యాతన్ పల్లిలో బీ.ఆర్.ఎస్ కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నదన్నారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్టని ఫైర్ అయ్యారు. ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.