మేడారం ఆలయ పునరుద్ధరణ చేపట్టడం జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

నిరంతరం భక్తులు, పర్యాటకులు సందర్శించే విధంగా మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప – లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని ప్రకటించారు. సమ్మక్క – సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు.  మేడారంలో జరిగిన మంత్రిమండలి సమావేశం అనంతరం నిర్వహించిన ఈ ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ సమ్మక్క – సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం. గుడి లేని తల్లులను గుండెనిండా నింపుకుని జరుపుకునే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయన్నారు. 2023 ఫిబ్రవరి 6వ తేదీన ఈ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పాం. అదే రీతిన ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని కుంభమేళాను తలపించే విధంగా, ఆదివాసీలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జాతర ప్రారంభమయ్యే జనవరి 28 నాటికి పూర్తి చేయాలని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేడారం ఆలయ పునరుద్ధరణ చేపట్టడం జీవితకాలం గుర్తుండిపోయే సందర్భమని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణలోగానీ హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సందర్భం లేదు. అలాంటి సమావేశాన్ని ఆదివాసీ ఆరాధ్య దైవం సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రమైన మేడారంలో నిర్వహించడంపై మంత్రివర్గ సహచరులందరూ సంతోషం వ్యక్తం చేశారని  గుడిని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని సీఎం రేవంత్  వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ పాల్గొన్నారు.