విద్యుత్ జేఏసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విద్యుత్ ఉద్యోగుల పట్ల సర్కార్ మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. మింట్ కాంపౌండ్ లో ఆందోళన చేస్తున్న 10 వేల మంది ఉద్యోగుల కుటుంబాల ఆవేదన ఈ ప్రభుత్వానికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎర్రగడ్డ స్కాడా ఆఫీసులో జరిగిన చర్చల్లో యాజమాన్యం ప్రదర్శించిన తీరు దుర్మార్గమని దుయ్యబట్టారు. బదిలీలను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడం ఈ ప్రభుత్వం అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. పిల్లల చదువుల మధ్యలో, విద్యా సంవత్సరం ముగియకముందే బదిలీలు చేపట్టి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. జూన్ వరకు ఆగమని అడుగుతున్నా కనికరించరా? వారు చేపట్టబోయే రిలే దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు. వెంటనే బదిలీలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.