ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యం.. పరీక్షా పత్రాల లీక్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

Spread the love

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా పత్రాల లీక్ ఘటన, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగాని తనాన్ని,  అసమర్థతను, అవినీతిని బట్టబయలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం ఇంకా మరువకముందే, ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, AI పెన్‌లతో రాసిన మోడరన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే, సీఎం  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని హరీష్ ప్రశ్నించారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరమన్నారు.  చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, రేవంతు రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. మహాకవి శ్రీశ్రీ గారు “కాదేదీ కవితకు అనర్హం” అని చెప్పారు… కానీ రేవంత్ రెడ్డి “కాదేదీ స్కాంకు అనర్హం” అని చెప్పడమే కాకుండా, చేసి చూపిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదు, పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతకాదని ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యమని ఎండగట్టారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.