ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సీఎం చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార శాఖ ఉద్యోగులు పనిచేయాలని సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో సమాచార శాఖకు కొత్త వీడియో కెమెరాలను మంత్రి పార్థసారథి తాజాగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార శాఖ ఉద్యోగులు నాణ్యమైన ప్రచారాలు చేయడానికి అవసరమైన అత్యాధునిక వీడియో కెమెరాలను అందించినట్లు తెలిపారు. సాంకేతికంగా అత్యుత్తమ క్వాలిటీ ప్రచారాలు అందించేందుకు ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. టెక్నాలజీలో వేగంగా మార్పులు వస్తున్నాయని, ఆ వేగాన్ని అందిపుచ్చుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుకే సిబ్బందికి సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా అత్యాధునికమైన కెమెరాలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఉన్న కెమెరాలకు అదనంగా ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసిన కెమెరాలతో మంత్రుల పర్యటనలు, జిల్లా కలెక్టర్ల పర్యటనలు, వీవీఐపీ, విఐపీ పర్యటనలు కవరేజికి వినియోగించుకోవాలన్నారు. 20 సోనీ పీఎక్స్ డబ్ల్యూ జడ్ 90 వి కెమెరాలను అధికారులకు మంత్రి చేతుల మీదుగా అందచేశారు. అతి త్వరలోనే అవసరమైన కంప్యూటర్ లు, 4 జి కిట్లను కూడా సమాచార శాఖకు సమకూర్చనున్నామని మంత్రి తెలిపారు.