వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్  పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తాం:కె.టి.ఆర్ 

Spread the love

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్ తో సీఎం పలికిస్తున్న పలుకులు చూసి యువతరం ఛీకొడుతోందని మాజీ మంత్రి కె.టి.ఆర్ విమర్శించారు. తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గారి మాట అమలై ఉంటే.. ఈ సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. కేసీఆర్ గారి హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి ఫోటోలకు ఫోజు కొట్టిన సీఎం, ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో “రిక్రూట్ మెంట్ జీరో”గా మారిపోయిందన్నారు. పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ కు పాతరేసి,  వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని,సీఎం చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది  పొరపాటేనని దుయ్యబట్టారు.  మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడని కె.టి.ఆర్ చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్  పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తాం అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు.