మాజీ సీఎం కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?:కె.టి.ఆర్

Spread the love

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కె.సి.ఆర్ కు కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, స్వయంగా కేసీఆర్ తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా  పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ మండిపడ్డారు.  ఈమేరకు సోషల్ మీడియాలో నోటీసు అంటించిన వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం  కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంటని ప్రశ్నించారు. 

ఇది అహంకారం కాకపోతే మరేమిటి? 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని ఘాటుగా ప్రశ్నించారు. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద పూర్తి విశ్వాసం ఉన్నదని అన్నారు. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం అంటూ కె.టి.ఆర్ పేర్కొన్నారు. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారని అన్నారు.