తన సొంత నియోజకవరాగమైన కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుప్పం నియోజకవర్గం జలకళతో కళకళలాడుతోందని హంద్రీ-నీవా కాలువల ద్వారా వచ్చిన కృష్ణమ్మతో చెరువులు నిండుగా కనిపిస్తున్నాయని అన్నారు. పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు తలపెట్టిన కుప్పం పర్యటనలో తొలి రోజు అగస్త్య అకాడెమీలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించారు. ట్రైనింగ్ తీసుకుంటున్న టీచర్లతో మాట్లాడాను. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు కొత్త ఆలోచనలు చేసేలా అగస్త్య అకాడెమీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉన్నాయని ప్రశంసించారు. అలాగే కంగుందిలో బౌల్డరింగ్ పార్క్ ప్రారంభించారు. ఈ పార్కు కుప్పంలో టూరిజం అభివృద్దికి దోహదం చేయనుంది. అనంతరం కుప్పం పట్టణంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను కుప్పంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువతకు ఉద్యోగ-ఉపాధి కల్పించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఇక నేడు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కుప్పంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.