
International Friendship Day 2025: చిన్ననాటి సరదా సంభాషణలతో మొదలై.. కష్టనష్టాల్లో కలిమి లేమి లేకుండా.. జీవనపర్యంతం కలిసి సాగే స్నేహ బంధం ఎంతో బలీయమైంది. గొప్పది కూడా.. రెండు శరీరాలు, ఒక హృదయంగా ప్రతిధ్వనించే కలుపుగోలు బంధం స్నేహం. అందుకే లోకమంతా దానికి దాసోహమవుతుంది. జీవితంలో మనం ఏర్పరచుకునే బంధాలన్నీ అవసరార్థమైనవే. కానీ స్నేహ బంధం మాత్రం వాటికి అతీతమైంది. ఏ స్వార్ధమూ లేకుండా, సహజంగా ఏర్పడే గాఢానుబంధం ఇది. అంతరాలు, అంతస్తుల ప్రస్తావన లేకుండా ఒకరి భుజంపై ఒకరు చేయివేసి, కలిగి సాగే సయోధ్య స్నేహితుల సొంతం. ఆపద సమయంలో ఎంతో ఊరటనిస్తూ.. జీవన వికాసానికి అది తోడుగా నిలుస్తుంది.
మన భారత్ వ్యాప్తంగా ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం/ ఫ్రెండ్‌షిప్ డేను అయితే జరుపుకుంటున్నాం. అయితే ఈసారి ఆగస్టు ౩న(ఆదివారం) ఫ్రెండ్‌షిప్ డే వస్తోంది. ఈ సందర్భంగా స్నేహితుల దినోత్సవ ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని మొదట 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గుర్తించింది. కాగా భారతదేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవడాన్ని నిర్ణయించింది. ఎందుకంటే, ఆ రోజు సాధారణంగా సెలవురోజు. కాబట్టి, స్నేహితులను కలిసి సరదాగా గడిపేందుకు సమయం ఉంటుంది. International Friendship Day 2025.
స్నేహం చేయడమూ గొప్పకళ. అయితే, స్నేహం పేరిట చెలామణీలో ఉన్న బంధాలన్నీ నిజమైనవేనా.. కవా అని బేరీజు వేసుకోవాలి. స్నేహితులు ఎంతకాదన్నా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనపై ప్రభావం చూపుతారు. అందుకే నీ వ్యక్తిత్వం ఏంటో నీ స్నేహితుల్ని బట్టి తెలుస్తుందంటారు పెద్దలు. స్నేహితులనేవారు ఒకరికొకరు మార్గదర్శనం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. మంచిమిత్రుడు సదా మన శ్రేయస్సు కోరతాడు. చెడ్డపనులు చేయబోతే అడ్డుకొంటాడు. మనలోని మంచి గుణాల్ని మరింతగా పెంపొందిస్తాడు. కష్టనిష్టురాల్లో బాసటగా నిలుస్తాడని అన్నారు భర్తృహరి.
రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహ శపథం చేశారు. పరస్పరం సహకరించుకున్నారు. సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసిన బాల్యమిత్రులు శ్రీకృష్ణ సుధామల మైత్రి కూడా చిరస్మరణీయమైనది. తనను సుదీర్ఘ కాలం తరవాత చూడటానికి వచ్చిన కుచేలుడి దయనీయ స్థితిని వాసుదేవుడు గ్రహించాడు. మిత్రుడు అడగకపోయినా అపార సంపదల్ని అందించాడు. తనను నమ్ముకొన్న ప్రియమిత్రుడు కర్ణుణ్ని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ని చేసి, దుర్యోధనుడు అతడ్ని గౌరవించాడు. వారిది కృతజ్ఞతకు మించిన స్నేహం. స్నేహ పరిధిని అధిగమించిన కృతజ్ఞత. ఈ రెండింటి కలబోతగా వారి బంధం బలపడింది.
ఎవరిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలో, వారితో ఎలా వ్యవహరించాలో, స్నేహ పరిమితులు ఏ మేరకు ఉంటాయో ‘విదుర నీతి’ వివరించింది. మంచి స్నేహితుడంటే మన ఆనందాల్ని కలుపుతూ, మన కష్టాల్ని తీసివేసి, అభ్యున్నతిని పెంచుతాడు. స్నేహితులంటే.. క్షీరనీర న్యాయాన్ని పాటించాలి. పాలు తనలో కలగలిసిన నీటికి తెల్లదనాన్ని, రుచిని అందిస్తాయి. అలాగే స్నేహితుడు తన ఉత్తమ గుణాల్ని నేస్తానికి పంచాలి. భావైక్యత, విశాల దృక్పథం, చిత్తశుద్ధితో కూడిన సంకల్పం… ఈ మూడింటి ఆధారంగా స్నేహం కలకాలం వర్ధిల్లుతుంది. ఎవరితో చేలిమి కూడదో మన విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
మరీ ముఖ్యంగా ఈరోజుల్లో కొత్త పరిచయాలు పెంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కోకొల్లలు.. కాబట్టి స్నేహమైనా, మరే బంధమైనా చూసి నడ్చుకోవడం ఉత్తమం.