మెగాస్టార్ చిరంజీవి నటించి సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. జనవరి 12న భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, తొలి రోజు నుంచే సెన్సేషనల్ ఓపెనింగ్‌తో సంచలనం సృష్టించింది. పండుగ సీజన్ కలిసి రావడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో తొలి వారం లోనే తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. సంక్రాంతి సినిమాలకు అసలు పరీక్షగా నిలిచే వీక్ డేస్‌లో కూడా తగ్గని జోరుతో ఈ అనిల్ రావిపూడి దర్శకత్వ చిత్రం ముందుకు సాగుతోంది. కీలకమైన సోమవారం కూడా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రెండు భారీ మైలురాళ్లను దాటింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఈ క్లబ్‌లోకి అత్యంత వేగంగా చేరిన ప్రాంతీయ చిత్రంగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా నిలిచింది.ఇంకా నార్త్ అమెరికాలో $3 మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి చిత్రంగా చిరంజీవి, అనిల్ రావిపూడి ఇద్దరికీ ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రీమియర్ షోల నుంచే చిరు కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం, అన్ని రోజుల్లోనూ స్టడీ వసూళ్లు రాబట్టి తొలి వారం ముగిసే సరికి బలమైన స్థితిలో నిలిచింది.చిరంజీవి అద్భుతమైన కామెడీ టైమింగ్, విన్టేజ్ డాన్స్ మూవ్స్‌కు అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలవడంతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ ప్రేక్షకుల వరకూ అందరినీ అలరించే హిట్‌గా మారింది. పండుగ వాతావరణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు అసాధారణమైన వసూళ్లు లభించాయి.మొత్తంగా ఈ సంక్రాంతికి స్పష్టమైన విజేతగా నిలిచిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’, ఈ ఏడాదిలోనే తొలి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది.