‘గ్లోబ్ ట్రోటర్’ అన్నారు కదా… మరి ‘టైం ట్రోటర్’ కథ ఏంటి???

Spread the love

రాజమౌళి సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే… దాన్ని ప్రేక్షకులలోకి బలంగా తీసుకెళ్లడం మరో లెవెల్. ఈ రెండు విషయంలోనూ ఆయనకు పోటీ ఎవ్వరూ లేరు ఇప్పట్లో రారు అని వారణాసి సినిమా ప్రమోషన్స్ చుస్తే తెలుస్తుంది. తెలుగు సినిమా రేంజ్ దాటి ఎప్పుడో, పాన్ వరల్డ్ స్థాయికి అయన వెళ్ళిపోయాడు. సో, ఆయన నుంచి సినిమా వస్తోందంటే అది కేవలం ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్ట్ కాదు… ఒక విజువల్ అద్భుతం అని అందరి ఫిక్స్ అయ్యారు!

ఒక సినిమాను నిర్మించడం ఎంత కష్టమో, దానిపై అంచనాలు పెంచుతూ ప్రేక్షకులను ఆ ప్రయాణానికి సిద్ధం చేయడం అంతకంటే పెద్ద మేజిక్. ఈ విషయంలో రాజమౌళి అనుసరించే వ్యూహాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టడీ అయ్యే స్థాయికి వెళ్లాయి. ప్రస్తుతం దాదాపు అన్ని భాషల స్టార్ దర్శకులు ఆయన పబ్లిసిటీ స్ట్రాటజీలను ఫాలో అవుతున్నారు. అలాంటి జక్కన్న, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ విషయంలో కూడా తనదైన మాయాజాలాన్ని చూపిస్తున్నారు.సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్, లాంగ్ టైం ప్రాజెక్ట్ అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే ప్రీ-ప్రొడక్షన్‌కు ఆరు నెలలకుపైగా సమయం కేటాయించారు. కథ, విజువల్స్, డిజైన్, టెక్నికల్ వర్క్… అన్నింటినీ ముందే పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు కథపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా, మరోవైపు ఒక్క చిన్న గ్లింప్స్‌తోనే ఈ సినిమా స్థాయి ఏంటో స్పష్టంగా చూపించారు.సాధారణంగా తన సినిమాల కథను ముందుగానే కొంతవరకు బయటపెట్టి, ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేయడం రాజమౌళి స్టైల్. కానీ ‘వారణాసి’ విషయంలో మాత్రం స్టోరీ లీక్స్ బయట పడకుండా చేస్తూనే, ఆసక్తిని రెట్టింపు చేయడంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లడం అంటే అది జక్కన్నకే సాధ్యం.

భారీ విజువల్ ఎఫెక్ట్స్, హై ఎండ్ గ్రాఫిక్స్ ఉన్న ఈ సినిమా పూర్తవడానికి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని చాలా మంది భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ, రాజమౌళి ఎలాంటి ముందస్తు హంగామా లేకుండా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న, అదీ సరిగ్గా ఉగాది పండుగ రోజున, ఈ విజువల్ వండర్ థియేటర్లలోకి రాబోతోందని తెలియజేశారు. ఎలాంటి ఈవెంట్లు, భారీ ప్రచారాలు లేకుండా, సింపుల్‌గా డేట్ చెప్పేసి సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచేశారు. సమ్మర్ సీజన్, పండుగ సెలవులు రెండూ కలిసి రావడంతో ఈ సినిమాకు లాంగ్ రన్ దాదాపు ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కనుందని సమాచారం. అంటే ఇప్పటివరకు భారతీయ ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఒక కొత్త సినిమా అనుభూతిని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారన్న మాట. 

ఇక ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరో హాట్ న్యూస్ ఏమిటంటే… ‘వారణాసి’ రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో “గ్లోబ్ ట్రోటర్” అనే పదం కనిపించడంతో, మొదటి భాగం ప్రపంచం చుట్టూ తిరిగే అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. రెండో భాగం మాత్రం “టైమ్ ట్రోటర్” పేరుతో, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను టచ్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు భాగాలు కలిసి ఒక ఎపిక్ జర్నీలా ఉండబోతున్నాయని టాక్. మొత్తంగా చూస్తే, రాజమౌళి ప్లానింగ్ చూస్తుంటే నిర్మాత పెట్టిన ప్రతి రూపాయిని పదింతలు కాదు… వందింతలు లాభాలతో తిరిగి తీసుకొచ్చేలా వ్యూహం రచిస్తున్నట్టు అనిపిస్తోంది. జక్కన్న ఆలోచనలు సామాన్యమైనవి కావు, ఆయన విజన్ ఎప్పుడూ కాలానికి ముందే ఉంటుంది. మహేష్ బాబును పూర్తిగా కొత్త అవతారంలో చూపించడమే కాదు, భారతీయ సినిమాను మరోసారి గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇక ఈ వారణాసి ప్రయాణం ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో, సినీ చరిత్రలో ఇంకెన్ని కొత్త అధ్యాయాలు రాయబోతుందో చూడాల్సిందే.