ఇటీవల శ్రీలంక తీరంలో ఇరాన్ వార్ షిప్ ఐరిస్-దేనాపై అమెరికా సబ్ మెరైన్ దాడి చేసి ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా స్పందించారు. ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం వచ్చిన పలు ఇరాన్ వార్ షిప్స్ ఊహించని విధంగా యుద్ధ ప్రభావానికి లోనైనట్లు తెలిపారు. ఐరిస్ లావన్ అనే మరో షిప్ తిరిగి వెళ్తుండగా అందులో టెక్నీకల్ ప్రాబ్లమ్ రావడంతో దానిని కొచ్చిలో అత్యవసర నిలుపుదలకు ఇరాన్ విజ్ఞప్తి చేసిన విషయాన్ని తెలిపారు. ఈమేరకు చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో భారత్ ఈ నెల 1న దానికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చిందన్నారు. దీంతో ఈ నెల 4న షిప్ ను ఇరాన్ కొచ్చిలో నిలిపిందన్నారు. అందులోని 183 మంది స్టాఫ్ కు కొచ్చిలోనే ఆశ్రయమిచ్చినట్లు తెలిపారు. భారత్ సరైన నిర్ణయమే తీసుకుందన్నారు. ఇక శ్రీలంక తీరంలో అటాక్ కు గురైన వెంటనే ఐరిస్ దేనా నుండి తొలుత శ్రీలంక నేవీకి ప్రమాద హెచ్చరిక వచ్చిందని, ఆ వెంటనే ఇండియన్ నేవీ దళాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయని పేర్కొన్నారు.