సైనా భారతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు: ఏపీ సీఎం అభినందనలు 

Spread the love

భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్  సైనా నెహ్వాల్‌ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆమెను చూసి ఎంతో గర్విస్తున్నామన్నారు.  ఆమె భారతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించి, దానిని ప్రపంచ పటంలో నిలబెట్టిందన్నారు. ఆమె కఠోర శ్రమ, పట్టుదల మరియు విజయాలు ఒక శాశ్వతమైన వారసత్వం, ఇవి మరెంతో మంది యువత కోర్టులోకి అడుగుపెట్టేలా స్ఫూర్తినిస్తాయన్నారు.  క్రీడకు ఆమె అందించిన సేవలకు అలాగే  ఇంతటి స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ అనంతర ప్రయాణంలో మీరు మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ చంద్రబాబు ‘ఎక్స్’ లో తెలిపారు. విద్యా,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ సైనా నెహ్వాల్ తన అచంచలమైన దీక్ష మరియు అద్భుతమైన ప్రతిభతో భారతీయ బ్యాడ్మింటన్ గమనాన్నే మార్చివేసి, దానిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. ఆమె ప్రయాణం ఎందరో  యువ భారతీయులకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. సైనా ఆటకు చేసిన సేవకు అందించిన ఈ గొప్ప వారసత్వానికి భారతదేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని స్పష్టం చేశారు. మీ జీవితంలోని తదుపరి అధ్యాయంలో కూడా మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.