కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. ఈ పుణ్యక్షేత్రం నుంచి భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకు వెళ్ళేది అమృతమైన లడ్డూలే. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. గత కొన్ని వందల ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా లడ్డూలను తయారు చేసి స్వామి వారికి ప్రసాదంగా పెడుతున్నారు. అసలు తిరుమల లడ్డూ తయారీ ఎప్పుడు మొదలుపెట్టారు. లడ్డూల తయారీ ఎలా జరుగుతుంది.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.? తిరుపతి లడ్డూకు ఉన్న చరిత్ర ఏమిటి. ఇప్పుడు చూద్దాం.
తిరుమల లడ్డూ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చారంటే లడ్డు తెచ్చారా..? అని అడగడం సహజం. ఎందుకంటే ఆ లడ్డు యొక్క రుచి, వాసన అలాంటిది. సాధారణంగా మనం తయారు చేసే లడ్డులను ఎంత గుమగులాడే విధంగా చేసినా తిరుపతి లడ్డుకు ఉండే రుచి మారే ఇతర లడ్డుకి రాదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ప్రపంచ నలుమూలల్లోని ప్రజలు తిరుపతి లడ్డు తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే తిరుపతి లడ్డు చరిత్ర ఇప్పటిది కాదు. దాదాపు మూడు వందల ఏళ్ల చరిత్ర తిరుమల లడ్డూకు ఉంది. చాలా గ్రంధాల్లో తిరుపతి లడ్డును గూర్చిన ప్రస్తావన ఉందంటే.. ఈ లడ్డుకి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ కూడా లభించింది. అంటే లడ్డు తయారు చేసే విధానం యొక్క అన్ని హక్కులు తిరుమల దేవా స్థానానికి మాత్రమే సొంతం. దీని తయారీ విధానాన్ని ఎవరు అనుకూలించకూడదు. ఒకవేళ ఆలా చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
15వ శతాబ్దంలో తిరుమల కొండపై భక్తులకు ఎలాంటి భోజన సదుపాయాలు ఉండేవి కాదు. దాంతో ప్రసాదాలు పంచడం మొదలు పెట్టి భక్తుల ఆకలి తీర్చేవారు. ఆ తరువాత 19 శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మహంతుల ద్వారా తీపి బూంది ప్రవేశ పెట్టారు. ఆ తీపి బూందినే 1940 నాటికీ లడ్డుగా మారింది.లడ్డు తయారీ కోసం కొన్ని ప్రత్యేక పద్దతులను తిరుమలలో పాటిస్తారు. నియమ నిబంధనలతో, భక్తి శ్రద్దలతో ఆ వేంకటేశ్వరుడి నామ స్మరణ చేసి లడ్డు తయారీ మొదలు పెడతారు. అందుకోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, ఎండు ద్రాక్ష, యాలకలు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలను వాడతారు.
చాలామంది తిరుపతి లడ్డు అంటే ఒకే విధంగా ఉంటుందని భావిస్తారు. కానీ ఈ లడ్డులో రకాలు కూడా ఉన్నాయి. ఆస్థాన లడ్డును ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 700 గ్రాములు ఉంటుంది. ఇందులో నెయ్యి కాస్త ఎక్కువ వేయడంతో పాటు ముంత మామిడి పప్పు, కుంకుమపువ్వు వంటివి ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక కల్యాణోత్సవ సమయంలో తయారు చేసే లడ్డును ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్తులకు, భక్తులకు మాత్రమే ప్రసాదంగా అందజేస్తారు. ఇక ప్రోక్తం పేరుతో తయారు చేసే లడ్డును సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.
తిరుమల ఆలయంలో వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఉన్న శ్రీవారి పోటు అంటే వంట శాలలో ఈ లడ్డు తయారు చేస్తారు. కేవలం లడ్డూ మాత్రమే కాకుండా ఇతర ప్రసాదాలు కూడా ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసిన ప్రసాదాలను శ్రీనివాసుడి తల్లి అయిన వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్లి ఆ తరువాత స్వామి వారికీ నైవేద్యంగా పెట్టడం ఆనవాయితిగా వస్తుంది.
ఇక శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా 1950లో టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. రోజులు గడిచే కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతుండడంతో దిట్టాన్ని కూడా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి సరిపడా సరుకుల దిట్టాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. దాని ప్రకారం ఆవు నెయ్యి-165 కిలోలు, స్వచ్ఛమైన సెనగ పిండి-180 కిలోలు, చక్కర-4కిలోలు, ఎండు ద్రాక్ష-16 కిలోలు, కలకండ-8 కిలోలు, ముంతమామిడి పప్పు-30 కిలోలు.. ఉపయోగిస్తారు. ఈ మిశ్రమంతో 5100 లడ్డూలు తయారవుతాయి.
ఇదండీ.. మనం ఎంతో ఇష్టంగా తినే తిరుపతి లడ్డూకు ఉన్న చరిత్ర. అలాంటి లడ్డూపై ఇప్పుడు నెలకొన్న వివాదంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.