దూసుకొస్తున్న జమిలి ఎక్స్ ప్రెస్-కేంద్రం నెక్స్ట్ స్టెప్ రెడీ.. ! రాష్ట్రాలకూ షాక్..

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జమిలి ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంది. దీంతో పాటు సుప్రీం ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ను ప్రధాని మోడీ కలిశారు. అటు పార్లమెంట్ లో మూడు కీలక రాజ్యాంగ సవరణల బిల్లుల్ని కేంద్రం సిద్ధం చేస్తోంది. దీంతో అనుకున్న దాని కంటే ముందే జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఇందుకోసం ఇప్పటివరకూ ఉన్న ఎన్నికల విధానాన్ని మారుస్తూ కేంద్రం మూడు బిల్లుల్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది. ఇందులో లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ల పదవీకాలాన్ని సమం చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ ఒకటి, అలాగే రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వీలుగా చేసే రాజ్యాంగ సవరణ మరొకటి. మూడోది అసెంబ్లీలు కలిగిన మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ చట్టాల్ని సవరిస్తూ చేయబోతున్నది.

వీటిలో రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన రెండో రాజ్యాంగ సవరణకు మాత్రమే కనీసం సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. మిగతా రెండు సవరణలకు ఆ అవసరం లేదు. ఈ మేరకు జమిలి ఎన్నికలపై సిఫార్సుల కోసం నియమించిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కమిటీ కేంద్రానికి ప్రతిపాదించింది. వీటిని కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దీంతో రాష్ట్రాలతో సంబంధం లేకుండానే జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం పావులు కదుపుతోంది.

మరోవైపు జమిలి ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయనే ప్రశ్నకూ సమాధానం దొరికేసింది. 2027 నుంచి 2029 మధ్య ఏకంగా 24 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. 2029లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉంటాయి. 2027 నుంచి 2028 మధ్య అయితే 16 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 2029లో జరగాల్సిన 8 రాష్ట్రాల ఎన్నికలను, లోక్ సభ ఎన్నికలను ముందుకు జరిపితే 2028లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే. దీని వల్ల 2027లో ఎన్నికలు పెండింగ్ ఉన్న 7 రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం పొడిగించాల్సి ఉంటుంది. వీటిలో హిమాచల్, పంజాబ్ మినహా మిగిలిన చోట్ల బీజేపీయే అధికారంలో ఉంది. కాబట్టి ఈ 7 రాష్ట్రాల అసెంబ్లీ గడువు పొడిగిస్తే 2028లో జమిలి నిర్వహణకు అనుకూలంగా ఉంది.