పొట్టి ఆవుల్ని పెంచుతున్న నాడీపతి డాక్టర్..! ఏంటీ మినియేచర్ ప్రత్యేకత..?

హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు ఆవు. గోమాతగా పూజించుకునే ఆవుల్ని పెంచేందుకు ప్రత్యేకంగా గోశాలలు చాలానే ఉన్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అపార్ట్మెంట్ ల లో సైతం పెంచుకోవడానికి అనువుగా మినియేచర్ ఆవులు పుట్టుకొస్తున్నాయి. ఆవులను మాంసం కోసం కబేళాలకు తరలించకుండా ఉండేందుకు చిన్న చిన్న ఆవులను పెంచడం తప్పనిసరి అవుతోంది. ఇలా కాకినాడ జిల్లాకు చెందిన ఓ నాడీపతి డాక్టర్ పొట్టి ఆవుల కోసం ఏకంగా గోశాల నిర్వహిస్తున్నారు.

ఆవులు మనుషులకు ఎంతో మచ్చికైన జంతువులు. భారతీయ సంస్కృతిలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం అఖండ భారతదేశంలో 302 రకాల ఆవు జాతులుండేవని పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అవి 32కి పరిమితమయ్యాయి. పొట్టి జాతి ఆవుల విషయానికోస్తే కర్ణాటక లోని మల్నాడ్ గిడ్డ,కేరళ లోని వేచూరు,ఆంధ్రప్రదేశ్ లోని మన్యం, బెంగాల్ లోని బోనీ, నేపాల్ లోని మినీ మౌస్ జాతులు ఉన్నాయి. మన్యం -ఒంగోలు బ్రీడ్స్ నుంచి అభివృద్ధి చేసినవే పుంగనూరు ఆవులు. ఇవి మూడు నుంచి ఐదు అడుగుల ఎత్తువరకు ఉంటాయి. పుంగనూరుతో సహా కనుమరుగైపోతున్న పొట్టి జాతి ఆవులను సంరక్షించాలన్న తపనతో కోనసీమకు చెందిన పెనుమత్స్య కృష్ణంరాజు సాగించిన పరిశోధనల ఫలితంగా అతి చిన్న మైక్రో మినియేచర్ ఆవులు పురుడు పోసుకున్నాయి.

మట్టినేలతో పాటు గచ్చు, టైల్స్ ఉండే ఇళ్లు, అపార్ట్మెంట్ లలో సైతం పెంచుకునేలా ఈ మినియేచర్ ఆవుల్ని అభివృద్ధి చేసారు. అడుగునుంచి రెండున్నర అడుగుల ఎత్తు,40 నుంచి 70 కిలోలా బరువుతో రోజుకి లీటర్ నుంచి రెండున్నర లీటర్ల పాలిచ్చేలా వీటిని అభివృద్ధి చేశారు. వీటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పశుగ్రాసం తో పాటు ఎలాంటి ఆహారాన్నైనా జీర్ణం చేసుకునే శక్తి కలిగి ఉంటాయి. ఎవరికైనా సులువుగా మచ్చిక అవుతాయి.ఇప్పటికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 మంది కి పైగా వీటిని అందించారు. మైక్రో మినియేచర్ తో పాటు వివిధ జాతులను కలిపి అభివృద్ధి చేసిన పొట్టి జాతి ఆవులు నాదీపతి గోశాలలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసేందుకు గో ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు.

నాడీపతి వైద్యవిధానంలో PHD చేసిన కృష్ణంరాజు.. అంతరించిపోతున్న పొట్టి జాతి ఆవుల పునరుత్పత్తిపై 14 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పొట్టి జాతి ఆవులను సృష్టించాలన్నసంకల్పంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద 5 ఎకరాల విస్తీర్ణం లో నాడీపతి గోశాలను స్థాపించారు. మొదటగా పుంగనూరు-బోనీ జాతి ఆవులను క్రాసింగ్ చేసి మూడు అడుగుల పొడవు గల పొట్టి ఆవులను అభివృద్ధి చేశారు. వాటిని దేశంలో ఇతర పొట్టి జాతి బ్రీడ్ లతో కుత్రిమ గర్భధారణ పద్దతిలో మరిన్ని పొట్టి జాతి ఆవులను అభివృద్ధి చేసారు. చివరగా పుంగనూరు తో బోనీ, మల్నాడు గిడ్డి, మినీ మౌస్, వేచూరు ఆవులతో క్రాసింగ్ జరిపి మైక్రో మినియేచర్ ఆవులను సృష్టించారు.

ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగీ వద్ద కూడా తాను ఇచ్చిన మినియేచర్ అవులున్నాయని కృష్ణంరాజు గర్వంగా చెబుతున్నారు. మినియేచర్ ఆవులు తక్కువ బరువు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మాంసం కోసం కబేళేలకు తరలించడానికి పనికి రావని చెప్తున్నారు. రానున్న కాలంలో ప్రతి ఇంట్లోను, అపార్ట్మెంట్ లోనూ వీటిని పెంచుకునేలా అభివృద్ధి చేస్తానని కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు.