మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు అండగా ఉంటూ, ఇంకా చెప్పాలంటే గతంలో వైఎస్సార్ కుటుంబానికి సైతం సన్నిహితంగా మెలిగిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బాలినేని బాటలో పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోబోతున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకు కీలక హామీ లభించినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ హయాం నుంచీ ఆయన కుటుంబీకులకు ఓ బలహీనత ఉంది. తాము ఎవరినైనా నమ్మితే లేదా తమకు ఎవరైనా విధేయులుగా ఉంటే చాలు వారి కోసం ఎందాకైనా వెళ్తారనే పేరుంది. సరిగ్గా ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని గతంలో చాలా మంది వైఎస్సార్ కూ, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ కూ సన్నిహితులుగా మారిపోయారు. వీరంతా అప్పట్లో కాంగ్రెస్ లో వైఎస్ వర్గం గానూ, ఆ తర్వాత వైసీపీలో అధినేత జగన్ కు సన్నిహితులుగానూ పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం తర్వాత వీరంతా యూటర్న్ తీసుకుంటున్నారు.
ఇలా వైఎస్ కుటుంబ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఎంపీ మోపిదేవి ఇప్పటికే వైసీపీని వీడగా.. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరో సన్నిహిత నేత, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. జనసేనలో చేరితే ఆయనకు ఇచ్చే పదవిపై కీలక హామీ లభించింది. దీంతో అతి త్వరలో ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే జరిగితే మోపిదేవి, బాలినేని తర్వాత వైసీపీని వీడబోతున్న మూడో జగన్ వీర విధేయ నేతగా నిలవబోతున్నారు.
గతంలో కాంగ్రెస్, వైసీపీల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు పార్టీ విప్ గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న సామినేని ఉదయభాను చేరితే జనసేనకు జగ్గయ్యపేటలో బలం పెరుగుతుందని ఆ పార్టీ కూడా భావిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక వైసీపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఉదయభానుపై జనసేన నుంచి క్లియరెన్స్ రాగానే వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు.