వంటింట్లో ఉల్లి బాంబ్

మెగా9 వెబ్ డెస్క్ : ఎక్కడైనా ఉల్లి కోస్తే కన్నీళ్లు వస్తాయి కానీ ఇప్పుడు ఉల్లి ధర వింటే చాలు కళ్లెమట నీళ్లు తిరుగుతున్నాయి. ఆ రేంజ్ లో ఉన్నాయి ఉల్లి ధరలు. మొన్నటి వరకు సామాన్యుడికి టమాటా రేట్లు చుక్కలు చూపిస్తే ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో ఉల్లి ధర ఉంది. కిలో ఉల్లి ధర 70 నుంచి 80 కి చేరింది. ఇప్పటికే కూరగాయల రేట్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సామాన్యుడికి ఉల్లి ధరలు ఊపిరాడకుండా చేస్తున్నాయి.

గత కొంత కాలంగా నిత్యవసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే అరకొర జీతాలతో కుటుంబ భారాన్ని మోస్తున్న సామాన్యుడికి ఈ పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాడు. నిత్యవసర సరుకుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనికి తోడు నిన్నమొన్నటి వరకు కురిసిన అధిక వర్షాలకు పంటలు కూడా వరునుడు ఎత్తుకుపోయాడు. మరోవైపు టమాట, ఉల్లి ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి. వారం క్రితం వరకు ఉల్లి ధర కాస్త పర్లేదు అనేంతగా రూ.వందకు 4 కేజీల వరకు విక్రయించిన వ్యాపారులు హఠాత్తుగా ధరలు పెంచేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పైకెగబాకాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తంతు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.40 నుంచి 60 వరకు పలికిన కిలో ఉల్లిపాయల ధర ఇప్పుడు రూ.70 నుంచి 80కి చేరింది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో రూ.80 కంటే అధిక ధర పలకడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ బడ్జెట్లు తల్లకిందులై వినియోగదారులు అల్లాడిపోతున్నారు. ఇక వ్యాపారులు మాత్రం ద్రవ్యోల్బణంతోపాటు ఉల్లి కొనుగోలు ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. పెరిగిపోతున్న ధరలకు ప్రభుత్వం కళ్లెం వేసి తమను ఆదుకోవాలని సామాన్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.