వారం గ్యాప్ లో రెండు వరల్డ్ రికార్డులు-మెగా బ్రదర్స్ అరుదైన ఘనత..!

ఓ ఇంట్లో ఒకరు ఓ రికార్డు సాధిస్తేనే ఘనంగా చెప్పుకుంటాం. అదే వరల్డ్ రికార్డు సాధిస్తే తన చుట్టూ ఉన్న సమాజమే గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో పుట్టిన సోదరులు ఇద్దరూ వారం గ్యాప్ లో వరల్డ్ రికార్డులు అందుకుంటే.. అదీ వేర్వేరు రంగాల్లో ఇద్దరూ వాటిని అందుకుంటే.. ఆ ఊహే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదూ. కానీ దీన్ని నిజం చేసి చూపించారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

తెలుగు సినీ ఇండస్ట్రీలో 80వ దశకంలో అడుగుపెట్టిన కొణిదల శివశంకర వరప్రసాద్ తన అసాధారణ నటన, డ్యాన్యులు, పైట్లతో టాలీవుడ్ రూపురేఖలనే మార్చేశాడు. తన డ్యాన్సులు, ఫైట్లతోనే థియేటర్లకు ప్రేక్షకులను క్యూకట్టేలా చేయగలిగిన ఆయన.. ఆ తర్వాత చిరంజీవిగా, మెగాస్టార్ గా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తొలిసారి కోటి రూపాయల రెమ్యునరేషన్ రికార్డు అందుకున్నా, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభాషణ్ అవార్డులు అందుకున్నా అదంతా తన స్వయంకృషితోనే. ఇప్పుడు ఏకంగా 24 వేల విభిన్న డ్యాన్స్ స్టెప్టులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనే చోటు సంపాదించడం విశేషం. ఇదంతా ఓ ఎత్తు అయితే ఆయన తమ్ముడు పవన్ సాధించిన ఫీట్ మరో ఎత్తు.

ఏపీలో గత ఐదేళ్లుగా నిర్వీర్యం అయిన పంచాయతీ వ్యవస్ధను గాడిన పెట్టేందుకు స్వయంగా ఏరికోరి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తున్న నేత పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా కంటే పంచాయతీ రాజ్ మంత్రిగా చెప్పుకునేందుకే గర్వపడుతున్న పవన్ తన శాఖ బాధ్యతలు చేపట్టిన మూడే నెలల్లో వరల్డ్ రికార్డు అందుకున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 13326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ సాధించారు. దీంతో వరల్డ్ రికార్డు ఆయన సొంతమైంది. ఇది జరిగిన వారం రోజుల్లోపే తన అన్న చిరంజీవి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకోవడంతో ఇదో అరుదైన రికార్డుగా మారిపోయింది.

ఇలా అన్నదమ్ములు రెండు వరల్డ్ రికార్డులు సాధించిన ఘనతను తెలుగు ప్రజలు ఇప్పటివరకూ చూసి ఉండరు. ఏదో ఒక రంగంలో వరల్డ్ రికార్డు సాధించడం చూసే ఉంటాం. కానీ రాజకీయాల్లో వరల్డ్ రికార్డు అందుకోవడం కూడా అరుదైన విషయమే. దీంతో ఇప్పుడు అన్నయ్య చిరు సాధించిన 24 వేల స్టెప్పుల రికార్డుతో పాటు పవన్ సాధించిన గ్రామసభల వరల్డ్ రికార్డు తెలుగు ప్రజలనే కాదు అందులో భాగమైన మెగా అభిమానుల్ని కూడా ఉబ్బితబ్బిబయ్యేలా చేస్తున్నాయి.