భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య పహల్గామ్ ఉగ్ర ఘటన తరువాత చోటుచేసుకున్న ఉద్రిక్తకర పరిస్థితుల సడలింపునకు తామే మధ్యవర్తిత్వం నడిపామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. కాల్పుల విరమణ విషయంలో ఎవరి జోక్యం లేదని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాల సైనిక డీజీఎంవోలు చర్చించి తీసుకున్న నిర్ణయమని, ఇందులో మూడో వారి పాత్ర లేదని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ పై కాల్పుల విరమణపై ఇప్పటికే పలు సందర్భాల్లో తమ వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిపింది.
ఈ ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సడలింపునకు తామే మధ్యవర్తిత్వం నడిపామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తాజాగా నిన్న ప్రకటించారు. ఉత్తర మయన్మార్ సంక్షోభం, ఇరాన్ అణు సమస్య, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతల పరిష్కారానికీ తాము మధ్యవర్తిత్వం వహించినట్లు పేర్కొన్నారు. ఇక భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో క్రెడిట్ పొందేందుకు ఇంతకుముందు ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు చైనా ఇందులో దూరింది. అయితే భారత్ మాత్రం తనదైన శైలిలో ఇందులో ఎవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది.