ప్రముఖ పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఈ కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయని, ఇటువంటి తరుణంలో బెయిల్ ఇవ్వడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా పోలీసులు కీలక వాదనలు వినిపించారు. ఇమంది రవికి విదేశీ పౌరసత్వం ఉందని, ఒకవేళ ఇప్పుడు బెయిల్ ఇస్తే అతను దేశం దాటి పరారయ్యే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు. ఈ వాదనల నేపథ్యంలో న్యాయస్థానం అతడి బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.