రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

సచివాలయంలో 233, 234వ SLBC సమావేశం జరిగింది. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదన్నారు.  వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలి. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలని సూచించారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయని స్పష్టం చేశారు. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నాయి… రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు ఇచ్చే రుణాలపై మరింత చొరవ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి… అప్పుడే అన్ని రంగాల్లో బడుగులూ ఎదుగుతారన్నారు. ప్రభుత్వాలుగా మేం చేయాల్సింది చేస్తున్నాం… బ్యాంకర్ల వైపు నుంచి సహకారం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని పేద-ధనికుల మధ్య తారతమ్యాలు పోవాలని పేర్కొన్నారు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు ఇటీవలే శంకుస్థాపన చేశామని అన్నారు. నిర్మాణాలు మరింత ఊపందుకుని త్వరితగతిన పూర్తి కావాలని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన మాదిరిగానే  ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను పటిష్టం చేయాలని తెలిపారు. టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లు అంగీకరించడం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నిస్తున్నాం… బ్యాంకర్లు కూడా సహకరించాలన్నారు. డ్వాక్రా గ్రూపు బ్యాంక్ అకౌంట్లపై  15 రకాల ఛార్జీలు వేస్తున్నారని బ్యాంకర్లు ఈ ఛార్జీలను తగ్గించాలని అన్నారు. భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం… గత ప్రభుత్వం 22ఏ పేరుతో భూ వివాదాలు సృష్టించిందిని ఇప్పుడు భూ రికార్డులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ఇస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకర్లు కూడా బ్యాంక్ ఖాతాల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందేమో ఆలోచించాలని సూచించారు.