భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించింది. దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా ఐదుగురికి ఈ అత్యున్నత పురస్కారాలు దక్కాయి. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతాజ్ సహా 13 మందిని పద్మ భూషణ్ కు ఎంపిక చేసింది. టాలీవుడ్ సీనియర్ నటులు మాగంటి మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్సహా 113 మందికి పద్మశ్రీలను ప్రకటించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ట్స్, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర, సాంకేతికత, ఇంజినీరింగ్, వాణిజ్యం, ఇండస్ట్రియల్, మెడిసిన్, లిటరేచర్,ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి ఈ పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు.