బీఆర్ఎస్ కు లోక్ సభలో ప్రాతినిథ్యం లేకపోవడంవల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో అన్యాయం:కె.టి.ఆర్

Spread the love

సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కింది గుండుసున్నా – మిగిలింది మొండిచెయ్యి మాత్రమేనని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ అన్నారు. బడాభాయ్ తో దోస్తీ చేసి తెలంగాణకు నిధుల వరద పారిస్తానని ప్రగల్బాలు పలికిన ఛోటాభాయ్ మాటలన్నీ బూటకమేనని కేంద్ర బడ్జెట్ సాక్షిగా తేలిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రం నుంచి పేరుకు ఇద్దరు కేంద్రమంత్రులున్నా తెలంగాణ పక్షాన కనీసం గొంతెత్తి అడగకపోవడం వల్లే తెలంగాణకు చిల్లి గవ్వ కూడా కేంద్ర బడ్జెట్ లో దక్కలేదని ఆక్షేపించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తోపాటు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన చెరో ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నట్టు ? మీ సొంత పైరవీల కోసమా మిమల్ని తెలంగాణ ప్రజలు గెలిపించి ఢిల్లీకి పంపించింది ?? అని ప్రశ్నించారు. స్వీయ రాజకీయ అస్థిత్వమైన బీఆర్ఎస్ కు లోక్ సభలో ప్రాతినిథ్యం లేకపోవడంవల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది కాంగ్రెస్, మరో 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కె.టి.ఆర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.