ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. 20 నెలలుగా కూటమి నేతల యూనిటీ కొనసాగుతోందని కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ మరింత యూనిటీ పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడతానని తెలిపారు. 40 మందిని వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడతా. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్ట్ ప్రిపేర్ అయి సభకు రావాలని స్పష్టం చేశారు. ఎవరేం మాట్లాడుతున్నారో నేనూ నోట్ చేసుకుంటా. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు. తాను కూడా రోజూ ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకూ అసెంబ్లీలో ఉంటానన్నారు. సభలో మాట్లాడేది 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. అక్కడ ఏం మాట్లాడినా వారి కోసమేనని గ్రహించాలని తెలిపారు. అనుకున్న విషయాన్ని 3 నుండి 7 నిమిషాల్లో మాట్లాడాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంతో ప్రజలకు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు.