వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత కమిటీ హాలులో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక అనంతరం, మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సభలో ఎంతసేపు మాట్లాడామనే దానికంటే కంటెంట్ ఉన్న అంశం ఎంత మాట్లాడామనేది ముఖ్యమని అన్నారు. దావోస్ లో సీఎం, తాను ప్రతి సంస్థపై ముందస్తుగా కసరత్తు చేసినట్లు తెలిపారు. అందుకే తమను కలిసిన ప్రతి సంస్థకు సీఎం బ్రీఫ్ గా ఏడు నిమిషాల్లోనే విషయం చెప్పి ముగించేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవగలిగారని అన్నారు. అసెంబ్లీలో కూడా సభ్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించిన ఎన్డీఏ పక్షాల శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యుల సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సహా కూటమి నేతలంతా హాజరయ్యారు.