తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్నే కాకుండా మిగతా కార్యకలాపాలను వేగవంతం చేశాయి. ఇక అక్కడ ప్రధాన పోటీ కూటమిగా ఉన్న ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన బీజేపీ 27 స్థానాల్లో పోటీచేయనున్నట్లు నేతలు ప్రకటించారు. ఆ కూటమిలోని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 18 చోట్ల, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) 11 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఇక ఈ కూటమిలో అతిపెద్ద భాగస్వామి అన్నాడీఎంకే మాత్రం ఇంకా ఎన్ని స్థానాల్లో పోటీచేస్తుందనే దానిపై ఎటువంటి విషయాన్ని తెలుపలేదు. అయితే ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీనే బరిలో నిలవనుంది. ఇక అధికార డీఎంకే తన మిత్ర పక్షమైన కాంగ్రెస్ కు 28 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లున్నాయి. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా..మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రాష్ట్రంలో డీఎంకే, ఎన్డీయేల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో త్రిముఖ పోటీ ఉండనుంది. అయితే ఆ పార్టీ ఏమేరకు ప్రజలను ఆదరణ పొందుతుందనేది చూడాల్సి ఉంది. మొత్తానికి తమిళనాట ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.